బుధవారం 18 ఎప్రిల్ 2012

కళకి....కులం..... ఉందా?

హరికధా పితామహుడైన శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయదాసు గారికి లోకంలో అసంఖ్యాకమైన శిష్య వర్గం ఉంది.వాళ్ళల్లో వాజపేయాజుల చిన సుబ్బ భాగవతులు ఒకరు.ఆయన శిష్యుడు పుత్సల భ్రమర దాసు రాజమండ్రి హరి కధా సరస్వతికి బాల బ్రహ్మానంద దాసు ఒక కన్నైతే, భ్రమర దాసు రెండవ కన్ను.భ్రమర దాసు అతి సామాన్యుడైన ఒక పేద చేనేత కార్మికుని బిడ్డ.ఐనా పూర్వ జన్మ సంస్కార భాగ్యం చేత సంస్కృతాంధ్ర భాషా పాండిత్యంతో పాటు,అమోఘమైన గాన కళా వైదుష్యం,ఆ రెండింటికి మెరుగులు దిద్దే నృత్య వైభవం,మచ్చుకైనా అపస్వరంలేని స్వచ్చమైన ఉచ్చారణ,మంద్ర మధ్యమ స్థాయిల్నిచర్రున తార స్థాయిలోనికి దూసుకుపోయి,గగన గర్భంలో స్థిర పడి, విస్తృత స్థాయిలో వీర విహారం చేసే,అతి మనోహర స్వరవిన్యాసం ఆ మహానుభావుడికి పెట్టని నగలు.శ్రోతలందర్నీ ఒక్క సారిగా భూ మండలం నుంచి నభో మండలానికి అలవోకగా తరలించుకు పోయి,స్వర డోలికల్లో ఊగించి,మై మరపించే విద్య ఆయనకి జన్మ సిద్ధం.ఆయన గళం పెంచినప్పుడు హార్మోనియం,ఫిడేలు మొదలైన వాయిద్యాలు ఆ స్వర గాంభీర్యాన్ని అందుకోలేక వెలవెలపోతూ ఉంటే,ఆపెయ్య మని చెయ్య చూపించిన దిట్ట ఈ భ్రమరదాసు.నారాయణ దాసు గారికి ప్రశిష్యుడైన ఈ భ్రమర దాసు గారి మీద యెనలేని ప్రేమ,గౌరవం,ఆత్మీయత,ఆప్యాయత, ఆదరం,అభిమానం.అలాగే ఈయనకూ ఆయనమీద "గురుస్సాక్షాత్పర బ్రహ్మ"అనే శిష్య వాత్సల్యమే నిండుగా మెండుకొని ఉండేది.పరమ గురువు,మరి! గురువు కంటె గొప్ప కదా!
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు
                          ఒకసారి ఒక అగ్రహారంలో సంపన్నుడైన వస్త్ర వ్యాపారి కూతురికి ఐదు రోజుల పెండ్లి చేస్తూ, భ్రమర దాసు గారిచేత ఆ ఐదు రోజులూ హరి కధలు చెప్పించడానికి ఆహ్వానించాడు.ఈ వార్త తెలిసి చుట్టు పక్కల ఊళ్ళ నుంచి జనం బళ్ళు కట్టుకొని, తండోప తండాలుగా వచ్చారు.జనాన్ని చూస్తే నిజమైన కళా కారుడికి ఆనంద తన్మయత్వం కలుగుతుంది కదా!ఆయన సత్యలోకం నుంచి సరస్వతీ దేవిని భూలోకానికి ఆహ్వానించి,ఆమె కాళ్ళకి స్వయంగా గజ్జెలు కట్టి,లోకోత్తర కళావైభవ సాక్షాత్కార పూర్వకంగా ఆనంద తాండవం చేయించారు.
                               ఇలా రెండు రోజులు గడిచిపోయాయి.మూడో నాడు "మార్కండేయ చరిత్ర"హరికధ చెపుతున్నారు.అది ఆయనకి అభిమాన హరికధ కూడాను.ఆ నాలుగైదు గంటలు వక్త అయిన ఆయనకీ,శ్రోతలైన అశేష ప్రజా సమూహాలకీ ఒంటిమీద తెలివి ఉండదు.అందర్నీ శివుడు ఆవేసించి ఉంటాడు.ఒక్కసారి ఆయన మార్కండేయ కధ విన్నాడంటే, యెంత కరుడు కట్టిన నాస్తికుడు కూడా నాస్తిక్యానికి తిలోదకాలిచ్చి, శివనామ సంకీర్తనంలో జీవితాన్ని ధన్యం చేసుకున్నాడన్నమాటే!అలా ఆయన కధా సరణికుపక్రమిస్తూ, "ఒరేయ్! దేముడెవడ్రా?శివుడు! భక్తుడెవడ్రా?-మార్కండేయుడు.ఈ చరిత్ర హరి కధగావ్రాయాలంటే! ఎవరికి సాధ్యంరా?ఆదిభట్ల నారాయణ దాసుకి.ఆ కధ గానం చెయ్యాలంటే ఎవరికి సాధ్యంరా?పుత్సల భ్రమర దాసుకి.అని ఇసకేస్తే రాలకుండా ఉన్న అశేష భక్త జన సందోహం ముందు సవాల్ చేశాడు.ఇది ఆ ఊర్లో ఉన్నయావత్ బ్రాహ్మణ్యానికి"ఈయన తప్ప ఇంకెవరూ ఈ హరి కధ చెప్పలేరా?"అన్నగొప్ప అసహనం రేకెత్తించింది వారిలో .
                   అంతే!ఉరుకులూ,పరుగులూ మీద విజయ నగరం వెళ్ళారు. నారాయణ దాసు గార్ని తీసుకొని వచ్చి,బ్రహ్మ రధం పట్టి ఊరేగిస్తూ, అఖండ సన్మానం చెయ్యడానికి ఏర్పాట్లు గంటల్లోచేసేశారు.
నారాయణ దాసు ఇలా జరగడంలో,ఇందులోని కీలకమైన అసలు కధేమిటా!అని ఆరా తీసి,విషయం గ్రహించారు.ప్రియ శిష్యుణ్ణి దగ్గరకు పిలిచారు. "ఊరేగింపులో నువ్వు నా రధానికి దగ్గరగా ఉండు!"అని ఆదేసించి పంపించారు.అఖండ కోలాహలం మధ్య ఊరేగింపు ప్రారంభమైంది.రధం మోకుల్ని బ్రాహ్మణులు పట్టి లాగుతున్నారు.మంగళ వాద్యాలు ఆకాశాన్నిబీటలు వారుస్తూ,మోగు తున్నాయి.కొంతమంది భజన సమాజాలవాళ్ళు శ్రావ్యంగా శివ నామ సంకీర్తనం చేస్తున్నారు.జన సందోహం నేల ఈనినట్లుగా ఉంది.జనాన్ని అదుపు చేయడం ఎవరి తరం కావడంలేదు.స్వచ్చంద సేవకులు గొంతు చించుకొని వేత్ర హస్తులై బరాబర్లు చేస్తున్నారు.ఆ సమయంలో రధం ప్రక్కనే నడుస్తున్నమన భ్రమరదాసు గారుండడం చూచి ఆదిభట్ల నారాయణ దాసు గారు తమ జబ్బ బలంతో ఆయన్ని ఒక్క ఉదుటున పట్టుకొని పైకి లేపి రధ మెక్కించి,తన ప్రక్కనే,కూర్చోబెట్టుకున్నారు.భ్రమరదాసు కళ్ళెదుటే! ఇంకో గొప్ప హరిదాసుకి ఘన సన్మానం చెయ్యడం ద్వారా ఆయనకి తల వంపులు తీసుకొద్దామనే పన్నాగంతో ఆదిభట్ల నారాయణ దాసుకి రధోత్సవం చేస్తోంటే,యెప్పుడూ కలలోనైనా ఊహించని విధంగా ఆయన ఇలా చేసేటప్పటికి కార్యకర్తలందరికీ పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడినట్లైంది.ఇప్పుడేమిటి కర్తవ్యం?బ్రహ్మ రధం పట్టమని వదిలేస్తే!, తమంతట తాముగా ఆహ్వానించి,తెచ్చుకున్న ఆదిభట్ల నారాయణ దాసుగార్ని అవమానించినట్లవుతుంది.బ్రహ్మ రధం పడితే,ఎవర్ని అవమానించదలుచుకున్నారో!అట్టి భ్రమర దాసు గారికి ఏకంగా బ్రహ్మ రధం పట్టినట్లవుతుంది.ఐతే మాత్రం ఇప్పుడింక చేయ దగ్గదేముంది! కార్యక్రమం మధ్యలో ఆపేస్తే!అపారమైన అప కీర్తిని శాశ్వతంగా నెత్తికి చుట్టుకున్నట్లవుతుంది.ఈ భయంతో కార్యక్రమాన్నిఅనుకున్నట్లుగానే ఆసాంతం కొనసాగించారు.తాము చేద్దామనుకున్నఅవమానం,కళకి కులంలేదనే సత్యాన్ని గుర్తించని సంకుచిత మనస్కులకే సంభవించింది.
                         

2 వ్యాఖ్యలు: