మంగళవారం 24 ఎప్రిల్ 2012

అక్షయ తృతీయ

నేడు మానవుడు చేసే ఏ కొద్ది పుణ్యమైనా అక్షయమైపోతుందని శాస్త్ర వచనం.అందుకే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.ఐతే ఈ నాడు కేవలం బంగారం కొంటే అక్షయం అయిపోతుందనే గుడ్డి నమ్మకాన్ని కొందరు తమ వ్యాపార దృక్పధాన్ని జోడించి లోకంలో ప్రచారానికి వదిలారు.నేడు బంగారం కొంటే అక్షయం అవుతుంది. కాదనగలమా!ఎంత సంపాదిస్తే మానవునికి తృప్తి అనేది కలుగుతుంది? నిజానికి ఈ అక్షయ తృతీయ అనేది నేడు విశేషంగా పుణ్య కార్యాలు చెయ్యమని.అవి నువ్వు ఏ కొంచెం చేసిన అవి అక్షయం అవుతాయి అని పిండితార్ధం.
                           నిజానికి ఈ అక్షయ తృతీయనాడు మనం ముఖ్యంగా చెయ్యవలసింది ఉదక భాండ దానం చెయ్యాలి.అంటే ఒక కుండలో నీరు నింపి,వాటిపై సుగంధ ద్రవ్యాలు కలగలిపి,ఒక సద్బ్రాహ్మణుడికి దానం చెయ్యాలిట.అలాగే ఈ రోజు విష్ణువునకు చందనం విశేషంగా సమర్పిస్తే విష్ణు సాలోక్యం కలుగుతుంది.అందుకే ఈ రోజున సింహాచల నృసింహ స్వామికి చందనోత్సవం మరియు కలశాభిషేకం జరుగుతుంది.అదే విషయాన్ని శాస్త్రం ఇలా సమర్ధిస్తోంది.
                          యహ:కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం,
                            వైశాఖస్య సితే పక్షే,సయాత్యాచ్యుతమందిరం.
అనగా వైశాఖ శుక్ల తృతీయ యందు శ్రీ కృష్ణ మూర్తికి చందనాను లేపన మిచ్చిన నరునకు విష్ణులోక సాయుజ్యం కలుగుతుంది.ఈ రోజున చేసే జప,దాన ,హోమ,తర్పణలు ఏ కొంచెమైన
అక్షయ మగును.నిజానికి ఇది కృత యుగాది.ఈ రోజున చేసే గంగా స్నానం కూడా విశేష ఫలాన్ని అందజేస్తుందట.అంతే కాదు యవలతో హోమము,యవాశనము, చేసినట్లైన, చేసిన సర్వ పాపాలు కూడా నశిస్తాయిట!
                       అలాగే ఈ రోజు దేవతలను,పితృ దేవతలనుద్దేసించి ఉదకుంభ దానం విధింపబడిది."శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ఉదకుంభ దానోక్త ఫలావాప్యర్ధం,బ్రాహ్మణాయ ఉదకుంభ దానం కరిష్యే" తదంగ కలశ పూజానాదికం కరిష్యే!"అని సంకల్పించి గంధ ఫల యవాదులతో, కూడిన సూత్రం చుట్టిన కలశాన్ని,బ్రాహ్మణుని పంచోపచారములచే పూజించి,
                    ఏషద్బ్రహ్మ ఘటో దత్తో,బ్రహ్మ విష్ణు శివాత్మక:
                    అస్య ప్రదానాత్సకలా ,మమ సంతు మనోరధా:"
అని దానం చెయ్యాలి.అదే పితృ దేవతల తృప్తికైతే,"పితౄణాం అక్షయ త్రుప్త్యర్ధం ఉదకుంభ దానం కరిష్యే!"అని సంకల్పించి,దానం చెయ్యాలి. కనీసం చలివేంద్ర ద్వారా నీటిని దానం చెయ్యడం కూడా మహా పుణ్యమే గదా!అలాంటి పుణ్య తిధినాడు విశేష కార్యక్రమాలు నిర్వహించి అక్షయ పుణ్య ఫలాలను పొందాలని,ఈ అక్షయ తృతీయ నాడు మనసారా కోరుకుంటూ,మరొక ముఖ్య విషయం!బంగారం కొనవద్దని నా అభిప్రాయంకాదు సుమండీ!కేవలం అతి తక్కువ ఖర్చులోనే విశేష పుణ్యం దొరుకుతూ ఉంటే,విశేష ధనాన్ని వెచ్చించి చేసే పుణ్యం గొప్పదంటారా!ఆలోచించండి.ఎవరి శక్తి వారిది.నోచుకున్న వారికి నోచుకున్నంత ఫలం కదా!

2 వ్యాఖ్యలు:

  1. శ్రీమదాదిశంకరులు:

    ఆద్యుండు వేదాంత వేద్యుండు నభవుండు
    నవనీస్థలంబున నవతరించె
    సకల యజ్ఞవ్రత సార సత్ఫలదాత
    రహిబూనె బ్రహ్మచర్య వ్రతంబు
    నఖిల విద్యల గురుం డాత్మవిద్యకు విభుం
    డగు వేల్పు విద్యల నభ్యసించె
    అన్నపూర్ణకు భర్త యఖిల జగత్పిత
    యవనిపై యశనార్థియై చరించె
    తల్లిదంద్రుల కమితమోదమ్ము గూర్చె
    గురుకులము జ్ఞానదీప్తుల వరలజేసె
    సహచరుల ధన్యుల నొనర్చె శంకరుండు
    సకల సద్గుణశాలి ప్రశస్తశీలి

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఈ మధ్యన అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనడం అన్నట్టుగా తయారయింది.. వేలంవెర్రి.. మా చిన్నప్పుడు ఎప్పుడూ వినలేదు దీన్ని...

    ప్రత్యుత్తరంతొలగించు